SBNEWS కర్నూలు జిల్లా: వాహన తనిఖీల సందర్భంగా బిల్లులు లేని వెండి బిస్కెట్లను తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ వెండి వ్యాపారులుగా గుర్తించారు. వీరు ఆదోనిలో వెండి కొనుగోలు, విక్రయాలు ముగించుకుని స్కూటీపై ఎమ్మిగనూరుకు తిరిగి వెళ్తుండగా పట్టణ శివారులో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో ఆగారు. స్కూటీలో ఉన్న వెండి బిస్కెట్లకు సంబంధించి కొనుగోలు బిల్లులు, ఇన్వాయిస్‌లు లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపించలేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లను కూడా జప్తు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్లు మరియు ఇతర ఆధారాలను తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులకు అప్పగించనున్నట్లు ఆదోని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
గమనిక: ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత వ్యక్తులపై నేరారోపణలు కోర్టులో రుజువయ్యే వరకు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగానే పరిగణించబడతారు.
0 కామెంట్‌లు