సర్పంచితో పాటు కార్యదర్శి కి చెక్ పవర్

సర్పంచితో పాటు కార్యదర్శి కి చెక్ పవర్... ఇకపై గ్రామాల ఆదాయం నేరుగా వాడుకోవచ్చు...! 
తెలంగాణలోని పల్లెల్లో స్వపరిపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా తొలగించి.. ఆ నిధులను స్థానిక అవసరాలకే నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీలకు ఇళ్లు, నల్లా పన్నులు, లేఅవుట్ అనుమతులు, సంతల నిర్వహణ, వేలం పాటల ద్వారా ఏటా సుమారు రూ.140 కోట్ల వరకు సొంత ఆదాయం సమకూరుతోంది. అయితే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ నిధులన్నీ ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతుండటంతో రూపాయి ఖర్చు చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అయింది.

ఈ పాత పద్ధతి వల్ల గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించాలన్నా, వీధిలైట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి అత్యవసర వస్తువులు కొనాలన్నా నెలల తరబడి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో పడుతున్నప్పటికీ తాము కష్టపడి వసూలు చేసుకున్న సొంత నిధుల కోసం సర్పంచులు ఇబ్బందులు పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి చట్ట సవరణకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆర్థిక స్వేచ్ఛను అమలు చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3)ని సవరించాల్సి ఉంటుంది. దీంతోపాటు నిధుల డ్రా ప్రక్రియలో పారదర్శకత కోసం జాయింట్ చెక్ పవర్ విధానంలో కీలక మార్పు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్, ఉపసర్పంచ్ ఉమ్మడి చెక్ పవర్ స్థానంలో.. ఉపసర్పంచ్‌ను తొలగించి గ్రామ కార్యదర్శికి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు రూపొందించిన రెండు ఆర్డినెన్స్‌లను త్వరలో జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తే.. పంచాయతీల సొంత ఆదాయం నేరుగా స్థానిక బ్యాంకు ఖాతాల్లోనే నిల్వ ఉంటుంది.

 అయితే.. నిధుల వినియోగంలో దుర్వినియోగం, అవినీతి జరగకుండా ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను విధిస్తోంది. పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి ఆదాయం, చేసే ప్రతి ఖర్చు వివరాలను విధిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఈ-పంచాయత్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పారదర్శకత కోసం ఆ వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డుపై ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి. వీటికి తోడు ప్రతి ఏటా తప్పనిసరిగా స్టేట్ ఆడిట్ విభాగంతో ఆడిటింగ్ నిర్వహించాలి. 

ఒకవేళ నిధుల వినియోగంలో ఎలాంటి అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినా సర్పంచ్, గ్రామ కార్యదర్శిలను సంయుక్తంగా బాధ్యులను చేస్తూ వారిపై కఠిన క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు