గ్రామసభ గ్రామ పాలనలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది- జానంపేట సర్పంచ్ ఉమామహేశ్వరి

గ్రామసభ గ్రామ పాలనలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది
- జానంపేట సర్పంచ్ ఉమామహేశ్వరి 
పినపాక
పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో సర్పంచ్ పూనం ఉమా మహేశ్వరి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు, సూచనలు వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి ఖాజా హుస్సేన్ గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ–వ్యయ లెక్కలను గ్రామసభ ముందుంచి వివరించారు. గ్రామాభివృద్ధి పనుల కోసం వచ్చిన నిధులు, వాటి వినియోగం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇచ్చారు.
అలాగే ఆన్లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో గ్రామపంచాయతీకి ఉన్న సంబంధాలు, వివిధ ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారా ఎలా పొందవచ్చో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
సర్పంచ్ పూనం ఉమా మహేశ్వరి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, గ్రామసభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామసభ గ్రామ పాలనలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా నిర్వహించబడిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం అనంతరం ఉపాధి హామీ కార్మికులకు సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ రాజేష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు