కరకగూడెం మండలం మదన్నగూడెం ఆదివాసి గ్రామంలో పైడిపల్లి వెంకట కృష్ణయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేతి పంపును మంగళవారం హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాన్ని సందర్శించి స్థానిక ఆదివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చైతన్య, తన తాతయ్య పైడిపల్లి వెంకట కృష్ణయ్య స్మృతిగా స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహర్షి సేవా సంస్థ నిర్వహకులు తోలెం శ్రీనివాసరావు సహకారంతో మదన్నగూడెం గ్రామాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను దగ్గరగా చూసి చలించానని ఆయన అన్నారు. గ్రామంలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉండటంతో మూడు రోజుల పాటు శ్రమించి బోర్‌వెల్ ఏర్పాటు చేసి, చేతి పంపును ప్రారంభించామని వివరించారు.
ఈ సందర్భంగా పైడిపల్లి చైతన్య మాట్లాడుతూ, ఆదివాసి గ్రామాలు ఇప్పటికీ అనేక మౌలిక సమస్యలతో సతమతమవుతున్నాయని, రాజ్యాంగం ద్వారా కల్పించిన అవకాశాలు పూర్తిస్థాయిలో వారికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ ప్రజలకు సరైన మార్గనిర్దేశం చేయడంలో విఫలమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సేవా కార్యక్రమాల ద్వారా అయినా పేదలు, గిరిజనులకు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బడిశ లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, గణేష్, లింగయ్య, ఉంగయ్య తదితరులు పాల్గొని ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కారంతో గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమైంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని గ్రామస్తులు కోరారు.
