ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో II, IV సెమిస్టర్ ఫలితాలు విడుదల

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో II, IV సెమిస్టర్ ఫలితాలు విడుదల
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ఏప్రిల్/మే నెలలో నిర్వహించిన II, IV సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.ఎస్.ఆర్. రాజేంద్ర సింగ్ చేతుల మీదుగా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల సాధించిన ఫలితాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్‌తో పాటు అధ్యాపక బృందాన్ని అభినందించారు.విద్యార్థుల కృషి, అధ్యాపకుల బోధనా విధానం, కళాశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయన్నారు . విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
 ఈ సందర్భంగా ప్రొఫెసర్ డి.ఎస్.ఆర్. రాజేంద్ర సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని విద్యను అభ్యసించాలని సూచించారు. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కాకుండా, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు ఎంతో అవసరమని అన్నారు . విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఏఈడిపి కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయా కోర్సులపై విద్యార్థుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, కోర్సుల ప్రాధాన్యత, ప్రాజెక్టుల నిర్వహణ, విద్యార్థుల ఆసక్తి, అడ్మిషన్ల ప్రక్రియ తదితర అంశాలపై వివరంగా మాట్లాడారు. విద్యార్థులు కొత్త కోర్సులు, నూతన విద్యా విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.ప్రాజెక్టుల విషయంలో విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించి ప్రాజెక్టులను రూపొందించాలని తెలిపారు. తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే విధంగా విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందిస్తే ఆచరణాత్మక పరిజ్ఞానం పెరుగుతుందని సూచించారు.అలాగే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ కెరీర్‌కు సంబంధించిన అంశాలపై కూడా విద్యార్థులు దృష్టి సారించాలని ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ సూచించారు. డిగ్రీ విద్య పూర్తయిన అనంతరం తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను కొనసాగించడం లేదా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల విద్యా ప్రగతికి అధ్యాపక బృందం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సాధించిన ఫలితాలు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చేసిన సమిష్టి కృషికి నిదర్శనమన్నారు.
కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు కళాశాలలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఫలితాల విడుదల కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. తమ ఫలితాలను తెలుసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. రాబోయే సెమిస్టర్‌లలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని అధ్యాపకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు