అశ్వాపురం: జర్నలిస్టులపై ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వర్కింగ్ జర్నలిస్టులను రాజకీయ కార్యకర్తలుగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని నెల్లిపాక పీఏసీఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అశ్వాపురం మండల జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు.అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ గౌతమీనగర్ కాలనీ గేటు నుంచి ప్రారంభమైన ర్యాలీ అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం అశ్వాపురం ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, జర్నలిస్టులపై నమోదైనట్లు పేర్కొన్న ఫిర్యాదులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సూర్యప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి రమణమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ వెలమ, ఐజేయూ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు మారుతి శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు పిండిగ వెంకట్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని అన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను వాస్తవాల ఆధారంగా ప్రజలకు తెలియజేయడమే జర్నలిస్టుల విధి అని అన్నారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానికంగా చోటుచేసుకునే పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారు తెలిపారు. వార్తలను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేసే వర్కింగ్ జర్నలిస్టులను ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.
జర్నలిస్టులకు రాజకీయ రంగు పులమడం, వారి వృత్తిపరమైన విధులను ప్రశ్నించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై బెదిరింపులు, ఒత్తిళ్లు తీసుకురావడం లేదా కేసులు, ఫిర్యాదులతో భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లిపాక పీఏసీఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులపై ఇచ్చిన ఫిర్యాదులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించే పరిస్థితులు ఉండాలని నాయకులు అన్నారు. జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల సమస్యలను అధికారులు సీరియస్‌గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు లేదా విధులకు ఆటంకం కలిగించే చర్యలు పునరావృతమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అన్ని జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాడతాయని తెలిపారు.
అశ్వాపురం మండల జర్నలిస్టుల నిరసన అనంతరం జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మణుగూరు డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, విధి నిర్వహణలో ఉన్న విలేకరులకు రక్షణ కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై నమోదవుతున్న ఫిర్యాదులు, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి శీరపు సాయి సంపత్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ములకలపల్లి గోపినాధ్, పర్స బోయిన రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు బెల్లంకొండ పుష్పగిరి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్–ఐజేయూ నియోజకవర్గ కార్యదర్శి బర్ల జోషి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు రెడ్డి మహేష్ కుమార్, వివిధ ప్రెస్‌క్లబ్‌ల అధ్యక్షులు కూరపాటి చలపతిరావు, కల్లూరి నరసింహారావు పాల్గొన్నారు.జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అన్ని జర్నలిస్టు సంఘాలను కలుపుకుని మరింత విస్తృత స్థాయిలో ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
అలాగే అశ్వాపురం మండలంలోని వివిధ ప్రెస్‌క్లబ్‌లకు చెందిన జర్నలిస్టులు మేడవరపు సుధీర్, లెనిన్ విజయ్ కుమార్, వెంకట్రావు, అర్జున్, నరేష్, నగేష్, కోటి నాగరాజు, సాంబిరెడ్డి, ఏడుకొండలు, తూము సత్యం, తోట అశోక్, బండారి బలరాం, మెట్రో శీను, ఏకాంబరం, కె.వి.రెడ్డి, ఓం ప్రకాష్, బాబు, నాగరాజు, అన్నబోయిన సతీష్, గడ్కారీ రామకృష్ణ, గంగరాజు, జూపల్లి కిరణ్, నయీం వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు