పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో టాయిలెట్ శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో టాయిలెట్ శుభ్రం చేసిన మంత్రి జూపల్లి
నాగర్‌కర్నూల్: పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులు, దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచి, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. ఫైళ్ల క్లియరెన్స్‌లో జరుగుతున్న జాప్యంపై ఆరా తీశారు. ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఆలస్యం చేయకుండా, దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదే సమయంలో కార్యాలయంలోని మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని మంత్రి గమనించారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా వినూత్న రీతిలో స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. స్వయంగా నీళ్లు పోసి టాయిలెట్‌ను శుభ్రం చేశారు. మంత్రి స్వయంగా మరుగుదొడ్డిని శుభ్రం చేయడంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
అనంతరం కార్యాలయంలో పారిశుద్ధ్య సామగ్రి, టైల్స్ ఏర్పాటు కోసం మంత్రి తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయం అందించారు. కార్యాలయ పరిసరాలతో పాటు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సేవలు అందించే కార్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు