ఖమ్మం: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని రెండు కళ్లలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని అన్నారు.
ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి భవన్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో లక్షలాది ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఓటర్ల జాబితా పరిశీలనలో పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, అనర్హమైన తొలగింపులు జరగకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆరోపణలు, రాజకీయ వ్యూహాలను కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల్లో వాస్తవ పరిస్థితులను వివరించి, పార్టీపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే స్పందించాలని సూచించారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను గ్రామస్థాయి నుంచి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ, టీపీసీసీ సూచించిన ఏడు అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించిన నాయకులు, వాటి అమలుకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రతి అంశంపై పగడ్బందీ ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఓటర్ల జాబితా అంశాలు, బూత్ స్థాయి పార్టీ వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత పెంచి ప్రజలకు మెరుగైన పాలన అందేలా కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. పెద్దబాబు, కోశాధికారి కొదుమూరి శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు