కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈనెల 26వ తేదీన ఎఫ్ఐఆర్ నెం. 589/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 69, 351(2) సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టి విషయంపై బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా ఈ విషయంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని, మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండకూడదని మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ పేర్కొన్నారు. గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుండి తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే ప్రమాణాలను రేగా కాంతారావు విషయంలో కూడా సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ ఉండకూడదని పేర్కొంటూ, ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియకు గౌరవం ఇస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఆమె కోరారు.
ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే మండల వ్యాప్తంగా మహిళలందరం కలిసి రోడ్డుపై బైఠాయించి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
0 కామెంట్‌లు