అశ్వాపురంలో ఆటో డ్రైవర్ల ఆవేదన.. జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి

అశ్వాపురంలో ఆటో డ్రైవర్ల ఆవేదన.. జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి
అశ్వాపురం: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని అశ్వాపురం ఆటో యూనియన్ సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు భాగవతపు సతీష్ తెలిపారు. ఆటోలకు తీసుకున్న ఫైనాన్స్‌లు, కుటుంబ పోషణ, పిల్లల చదువుల భారంతో అనేక మంది డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులను పాఠశాలలకు ఆటోలలో రవాణా చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు ఓవర్‌లోడ్ చేయవద్దని, ఫిట్‌నెస్‌తో వాహనాలు నడపాలని సూచించడం సమంజసమేనని, విద్యార్థుల భద్రత విషయంలో తమకూ పూర్తి బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

అయితే తమ ఆర్థిక పరిస్థితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పాఠశాల రవాణా, సాధారణ ప్రయాణికుల ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంతోనే ఫైనాన్స్‌లు చెల్లిస్తూ కుటుంబాలను పోషిస్తున్నామని తెలిపారు. గతంలో ఫైనాన్స్ భారం తట్టుకోలేక పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను గుర్తుచేశారు.

కొంతమంది జర్నలిస్టులు ఆటోలను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రచురించడం వల్ల అధికారుల ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ఫిట్‌నెస్, బీమా, లైసెన్స్ వంటి అన్ని నిబంధనలు పాటిస్తామని, అదే సమయంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీయకుండా ప్రభుత్వం, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు