పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలి

పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలి
-నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల నిరసన
ఆదోని, జూలై 28: కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పాండవగల్లు గ్రామ పెద్ద చెరువు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు మంగళవారం నిరసన చేపట్టారు. ఆదోని–మాధవరం ప్రధాన రహదారిపై పాండవగల్లు గ్రామ సమీపంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని తమ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ, గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 13 సంవత్సరాలుగా పాండవగల్లు పెద్ద చెరువు వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, దీనివల్ల గ్రామ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువు సమస్య కారణంగా సాగునీటి వ్యవస్థ దెబ్బతిని వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేపు నారా లోకేష్ ఆదోని పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సమస్యపై స్పష్టమైన ప్రకటన చేసి, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరసనకారులు కోరారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, ఎన్నికల సమయంలో చేసిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

సీపీఎం నాయకులు మాట్లాడుతూ, పాండవగల్లు పెద్ద చెరువు గ్రామ ప్రజల జీవనాధారమని తెలిపారు. ఈ చెరువుపై ఆధారపడి వందలాది ఎకరాల్లో సాగు జరుగుతుందని, చెరువు సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి చెరువును పూర్తిస్థాయిలో రైతుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా విస్మరిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పెద్దలు కే. మారయ్య, పి. ఈరన్న, మాజీ వైస్ సర్పంచ్ జే. తిక్కయ్య, రామాంజనేయ, కే. హనుమంతు, సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు జే. రామాంజనేయులు, మండల నాయకులు కే. పాండురంగ, శాఖ కార్యదర్శులు కే. గోవిందు, అనీఫ్ బాషా, నర్సిరెడ్డి, భీమాంజనేయులు, తాయప్ప, తాయన్న, హనుమంతరెడ్డి, కొండయ్య, రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే. హుసేని, డీజే నర్సిరెడ్డి, మంజు, పాండవగల్లు గ్రామ విద్యా కమిటీ చైర్మన్ ఎస్. తాయన్న, డీవైఎఫ్‌ఐ సీనియర్ నాయకులు ఎస్. రామాంజనేయులు, గ్రామ అధ్యక్షుడు కే. వీరేష్, గ్రామ కార్యదర్శి కే. వీరాంజి, మండల నాయకులు మోహన్ రెడ్డి, గ్రామ నాయకులు భాస్కర్, ఎస్. తాయన్న, కే. రామకృష్ణ, అన్వర్ బాషా తదితరులు పాల్గొని పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు