అచ్చంపేట: నల్లమల ప్రాంత గిరిజనులు, ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరులో పర్యటించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి రూ.12.70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే చెంచు గిరిజనుల స్వయం ఉపాధి కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు కూడా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పలు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టళ్లు, వంటశాలలు, భోజనశాలలు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యా నాణ్యత, ఆహారం, ఆరోగ్య సేవలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధనపై వివరాలు తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఉన్నా సంకోచం లేకుండా తెలియజేయాలని సూచించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు అమూల్యమైన ప్రకృతి సంపద అని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఆర్టికల్–273(1) గ్రాంట్, PM DA–JGUA పథకాల కింద అమ్రాబాద్, పదర మండలాల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు, తాగునీటి సౌకర్యాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.12.70 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. చెంచు గిరిజనులు అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మధ్యవర్తుల దోపిడీ తగ్గి గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని చెప్పారు.
దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ ఆశయాలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నల్లమల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
గురుకులాల్లో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు ఇతర అవసరాల కోసం కాస్మొటిక్ చార్జీలను కూడా పెంచామని చెప్పారు. ఉపాధ్యాయుల కొరతను త్వరితగతిన భర్తీ చేసి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నల్లమల ప్రాంతంలోని గిరిజనులు, దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధి రంగాల్లో విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని, రూ.1.80 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్ చెంచు గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఈఓ రమేష్ కుమార్, ఆర్డీవో యాదగిరి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు