కరకగూడెం మండలంలో గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు


కరకగూడెం మండల పరిధిలో అక్రమ సారా తయారీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కౌలూరు మరియు కలవలనాగారం గ్రామాల మధ్యలో ప్రవహిస్తున్న పెద్ద వాగు సమీపంలో గుడుంబా తయారీ జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున సారా తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకును పోలీసులు ధ్వంసం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, సారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 1000 లీటర్ల బెల్లం పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను అక్కడికక్కడే పగలగొట్టారు. అలాగే సారా కాచేందుకు ఉపయోగించే బిందెలు, గిన్నెలు, ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా రహస్యంగా గుడుంబా తయారీ జరుగుతుందని సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
కరకగూడెం మండలంలో ఎవరైనా అక్రమంగా సారా కాచినా, విక్రయించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ పీ. వి. ఎన్. రావు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత, కూలీలు గుడుంబా మత్తుకు బానిసలై కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా సారా తయారీ లేదా విక్రయం జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించి 8712682102, 8712682103 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
అక్రమ సారా నిర్మూలనకు పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తామని, కరకగూడెం మండలాన్ని గుడుంబా రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు