టీ ఆర్ పి (తెలంగాణ రాజ్యాధికార పార్టీ)తరఫున సర్పంచ్ గా శైలజ నామినేషన్

నడింపల్లి గ్రామం లో టీ ఆర్ పి (తెలంగాణ రాజ్యాధికార పార్టీ)తరఫున సర్పంచ్ గా శైలజ నామినేషన్ పత్రాల దాఖలు 
- టీ ఆర్ పి కన్వీనర్ బి.ఆంజనేయులు

నాగర్ కర్నూల్,డిసెంబర్ 03(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం 
నడింపల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల హోరాహోరీ పోరు వేడెక్కుతోంది. తెలంగాణరాజ్యాధికార పార్టీ(టీఆర్‌పీ) అభ్యర్థిగా శైలజ బుధవారం నడింపల్లి గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీఆర్‌పీ అచ్చంపేట కన్వీనర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారీగా హాజరైన గ్రామ ప్రజలు, యువత శైలజకు తమ మద్దతు ప్రకటించారు. ఆమె గెలుపు ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.



“అభివృద్ధే నా లక్ష్యం” — శైలజ

నామినేషన్ సమర్పించిన సర్పంచ్ అభ్యర్ధి శైలజ మాట్లాడుతూ, సర్పంచ్ పదవి దక్కితే గ్రామ యువతకు,అందరికి మార్గదర్శకంగా నిలుస్తానని హామీ ఇచ్చారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్ల బారిన పడకుండా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా గ్రామంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణ, త్రాగునీటి సమస్యల నివారణ, పరిశుభ్రత మెరుగుపరచడం, రహదారుల నిర్మాణం, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వివరించారు.

గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. "కొంతమంది నాయకులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే చూసి బాధపడుతున్నాను. నేను పార్టీలకు అతీతంగా సేవ చేస్తాను. నడింపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను" అని శైలజ తెలిపారు.

“అక్రమాలను అరికట్టడమే టీఆర్‌పీ లక్ష్యం” — ఆంజనేయులు

ఈ సందర్భంగా టీఆర్‌పీ కన్వీనర్ ఆంజనేయులు మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలకు తమ పార్టీ గట్టి పోరాటం చేస్తోందని చెప్పారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ప్రజలకు అందజేస్తామన్నారు.

నడింపల్లిలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో విస్తారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాభివృద్ధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శైలజను భారీ మెజారిటీతో గెలిపిస్తే అవినీతి నిర్మూలనలో ముందుండి పనిచేస్తారని, యువతకు ఆదర్శంగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న యువత, ప్రజలు, పార్టీ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.