కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిసరాల్లో బుధవారం చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైల్వే ట్రాక్ వద్ద పడిఉన్న నాటు బాంబును కుక్క ప్రమాదవశాత్తూ కొరకడంతో అది పేలి కుక్క మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర శబ్దంతో బాంబు పేలిన వెంటనే పరిసరాలన్నీ ఒక్కసారిగా సంచలనం ఏర్పడింది. ట్రాక్‌పై ఏదో తినే ఆహారం గా భావించి కుక్క ఆ బాంబును కొరకగా వెంటనే పేలుడు సంభవించి అది అక్కడికక్కడే మరణించింది.
ఈ సంఘటనతో కొత్తగూడెం నల్లిబొడ్డులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే ట్రాక్‌పై పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? ఎవరు ఉంచారు? ఏ ఉద్దేశంతో ఉంచారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్త తెలిసిన వెంటనే పోలీసులు, రైల్వే భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ బాంబు ఎలా అక్కడికెళ్లిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇలాంటి పేలుడు పదార్థాలు పక్కనే ఉన్న రోడ్లు, కాలనీలు, రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. స్థానికులు రైల్వే ప్రాంతాల్లో భద్రత మరింత కఠినంగా ఉండాలని, అపరిచిత వస్తువులు కనిపించిన వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Social Plugin