ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించిన సీఐటీయూ

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించిన సీఐటీయూ
గుండాల మండలం డిసెంబర్ 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో గుండాల మండలానికి చెందిన సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ చర్యను సీఐటీయూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.

మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా నాయకురాలు ఎండీ నజ్మా, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జ సుశీల, జబ్బ ఆదిలక్ష్మి, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్‌కు చెందిన మండల నాయకురాళ్లు విజయలక్ష్మీ, వినోద, ఈశ్వరి, భద్రమ్మ, సమ్మక్కలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎం ఆర్ ఓ కార్యాలయంలో బైండోవర్ చేసిన ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

ఈ అక్రమ అరెస్టులను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబి, జిల్లా కమిటీ సభ్యులు పాయం సారమ్మ ఖండిస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పర్యటన అనే పేరుతో కార్మిక నాయకులపై నిర్బంధం విధించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని వారు పేర్కొన్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రికి ప్రతిపాదించేందుకు, వినతిపత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల హక్కులను అణగదొక్కడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించిన సీఐటీయూ నాయకులు, ఈ ఘటనపై అన్ని ప్రజాతంత్ర వాదులు, కార్మిక సంఘాలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.