భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలో రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు శాఖ శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం కరకగూడెం పోలీసు స్టేషన్ పరిధిలోని సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడుల్లా బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. వెంకటేశ్వర రావు, కరకగూడెం ఎస్ఐ పి. వి. ఎన్. రావు తో పాటు స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.
పోలీసు అధికారులు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి రాబోయే ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, న్యాయపరంగా జరగేందుకు అందరూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎన్నికలు ఉధృతంగా సాగనున్న నేపథ్యంలో కొన్ని ముఖ్య సూచనలను పోలీసులు ప్రజలకు వివరించారు.
ఎన్నికలు శాంతియుతంగా జరగాలి
సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్థులందరూ ఎన్నికల సమయంలో శాంతిని కాపాడే విధంగా ప్రవర్తించాలని సూచించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తేనే అవి సాఫీగా సాగుతాయని తెలిపారు. ఎవ్వరూ గొడవలు, వాగ్వాదాలు లేదా ఉద్రిక్తతలకు దారి తీసే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.
అవసరం లేని వాగ్వాదాలకు తావు ఇవ్వొద్దు
పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరిస్తూ—ఎవరైనా గ్రామ ప్రజలు లేదా పార్టీ కార్యకర్తలు అనవసరంగా ఇతరులతో గొడవలు పెట్టుకుంటే లేదా ఒకరి మీద ఒకరు దూషణలకు పాల్పడితే, వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సమయంలో చిన్న పోటీ వ్యక్తిగత విభేదాలకు దారితీయకూడదని తెలిపారు.
విజయోత్సవ ర్యాలీలపై స్పష్టమైన నిషేధం
ఎన్నికల రోజున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు చేయరాదని సీఐ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్లను ప్రలోభపరిస్తే కఠిన చర్యలు
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను బెదిరించడం, డబ్బు, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలు చూపించడం చట్ట విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఓటర్ల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరు తప్పించుకోలేరని సీఐ అన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు చేస్తే కఠిన చర్యలు
పోలింగ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎవరైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినా, గుంపులుగా చేరినా, 163 BNSS (144 CrPC) అమలు ఉన్నందున వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపినారు. ప్రజలు ఓటు వేయడానికి భయపడకుండా రావడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల పూర్తి సహకారం అవసరం
కరకగూడెం, భట్టుపల్లి గ్రామాల ప్రజలు ఈ సూచనలను గౌరవించి ఎన్నికల నిర్వహణలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సీఐ వెంకటేశ్వరరావు కోరారు. ఎన్నికలను స్వచ్ఛంగా, నేరాల రహితంగా నిర్వహించడం కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పి. వి. ఎన్. రావుతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin