భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ అభ్యర్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతి అభ్యర్థి పాటించాల్సిన నియమాలు, నిబంధనలు స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అభ్యర్థులు ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించడం తప్పనిసరి అని చెప్పారు. ప్రచార సమయంలో అనవసర ఉద్రిక్తతలు రాకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని సూచించారు. అక్రమంగా డబ్బు, మద్యం లేదా ఇతర ప్రయోజనాలతో ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండ్‌క్ట్ ఉల్లంఘన, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, ఓటర్లను బెదిరించడం, బూతు క్యాంపుల ఏర్పాటు వంటి అక్రమ చర్యలపై నమోదు అయ్యే కేసుల గురించి కూడా వివరించారు. ప్రతి అభ్యర్థి తమ ప్రచారం శాంతియుతంగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా నిర్వహించాలని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థులు పోలీసులు తీసుకుంటున్న ఏర్పాట్లను అభినందిస్తూ, నిబంధనలను పాటించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామస్థాయి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం సౌహార్దపూర్వకంగా విజయవంతంగా ముగిసింది.
Social Plugin