అధికార కాంగ్రెస్ తో పోరాడి గెలిచిన ప్రతి సర్పంచ్ హీరోనే

అధికార కాంగ్రెస్ తో పోరాడి గెలిచిన ప్రతి సర్పంచ్ హీరోనే 
- సిపిఎం, బీఆర్ఎస్ కూటమిలో గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మానం 
- రాబోయే జెడ్పిటిసి ఎంపీటీసీల్లో ఇదే విజయం కొనసాగించాలని పిలుపు 
పినపాక: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ అభ్యర్థులతో పోరాడి, గట్టి పోటీ ఇచ్చి గెలిచిన సర్పంచ్‌లు హీరోలేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశ నిర్వహించారు. 
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను వారు ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ పార్టీల నుండి గెలిచిన సర్పంచులు అసూయపడేలా బీఆర్ఎస్, సీపీఐ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో జరిగే అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో ఎందుకున్నామా..? అని ఆయా పార్టీల సర్పంచులు అనుకునేలా పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీనిచ్చి గెలిచిన సర్పంచులు హీరోలేని కొనియాడారు. తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసేందుకు పైసలు లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. రాబోయే రోజుల్లో సర్పంచులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సీపీఎం , బీ ఆర్ ఎస్ నుంచి గెలిచిన ప్రతి సర్పంచ్‌కు అన్ని విధాలుగా అండగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉంటారన్నారు. అధికార కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తీవ్ర స్థాయికి చేరక ముందే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో పార్టీ గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. అనంతరం ఎన్నికైన సర్పంచులను వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మడివి రమేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసు బాబు, భవాని శంకర్, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ఎడ్ల కుమార్, బిఆర్ఎస్ నాయకులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు