ఆడబిడ్డలకు పుట్టింటి కానుక కాంగ్రెస్ చీరలు అందిస్తుంది: ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని దోసపాటి వారి కళ్యాణ మండపంలో ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా అందజేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ప్రధాన అతిథిగా హాజరై చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన పాయం వెంకటేశ్వర్లు గారు మహిళల గౌరవం, వారి ఆర్థిక స్వావలంబన మరియు శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ మహత్తర పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డలకు సారె, చీర ఇవ్వడం ప్రత్యేకమైన విషయం. అదే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంక్షేమ పథకంగా తీసుకువచ్చిందని వివరించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు మొదటి దశ, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 9 వరకు రెండో దశగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్‌డిఓ స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. మహిళలకు సమాన అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, మహిళలకు యజమాన్యం కల్పించడం, పాఠశాలల యూనిఫార్మ్ కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించడం వంటి పథకాలు మహిళా శక్తీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దాని కోసం వివిధ రంగాలలో సృజనాత్మక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏడిఓ తాతారావు, ఎంపీఓ ముత్యాలరావు, ఏపీఎం జ్యోతి, స్పెషల్ ఆఫీసర్ నాగార్జున, డిప్యూటీ తాసిల్దార్ అనూష, వెలుగు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కుంజా సునీత, గ్రామపంచాయతీ సెక్రటరీలు, మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, గాదే కేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, తూము వీర రాఘవులు, మట్టా వీరభద్ర రెడ్డి, ఆవుల రవి, బట్టా సత్యనారాయణ, బచ్చు వెంకటరమణ, బరాజు సంపత్, ఎనిక రవి, భూరెడ్డి వెంకటరెడ్డి, గొల్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.