గుండాల మండలం నవంబర్ 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీకి చెందిన జిల్లా కమిటీ సభ్యుడు
గుండాల గ్రామానికి చెందిన నేత వాంకుడోత్ అజయ్ (అలియస్ బికోజి) పార్టీ సభ్యత్వానికి మరియు జిల్లా కమిటీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
అజయ్ 2007 సంవత్సరంలో ఉమ్మడి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీలో చేరి, అప్పటి నుండి పార్టీ నిర్మాణం, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ, ముకుందాపురం మరియు పోలారం ఏరియాలలో కీలక పాత్ర పోషించారు. 2022లో పార్టీ విభజన అనంతరం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ వైపు చేరి, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
తన రాజీనామా ప్రకటనలో అజయ్ మాట్లాడుతూ — “ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పార్టీ కార్యక్రమాల్లో సమగ్రంగా పాల్గొనడం సాధ్యంకాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. ఇంతకాలం నాపై విశ్వాసం ఉంచిన నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని తెలిపారు.
అయితే ఆయన రాజీనామా పార్టీ అంతర్గత పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై జిల్లా స్థాయి నాయకత్వం ఇంకా స్పందించలేదు. స్థానికంగా ఆయన రాజీనామా నిర్ణయం పార్టీ కార్యకర్తల్లో చర్చకు దారితీస్తోంది.
వాంకుడోత్ అజయ్ పార్టీకి దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారు. ఆయన రాజకీయ ప్రయాణం, క్రమశిక్షణ, కట్టుబాటు పార్టీ చరిత్రలో గుర్తుండిపోతుందని అనుచరులు పేర్కొన్నారు.
Social Plugin