స్వాతంత్ర్య భారత్ న్యూస్ కథనానికి స్పందన...గుండాలలో గడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయాలపై అధికారులు తనిఖీలు

గుండాలలో గడువు ముగిసిన కూల్డ్రింక్స్ విక్రయాలపై అధికారులు తనిఖీలు
పత్రికా కథనానికి స్పందించిన అధికారులు – హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
గుండాల, నవంబర్ 4 (ప్రత్యేక ప్రతినిధి)

ఇటీవల గుండాలలో గడువు ముగిసిన కూల్డ్రింక్స్ – ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారులు అనే శీర్షికతో స్వాతంత్ర్య భారత్ దిన పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు. పత్రికా కథనం వెలువడిన కొద్దీ గంటల్లోనే జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ శరత్, ఫుడ్ అనాలసిస్ ఆఫీసర్ రతన్ గుండాల మండలానికి చేరుకుని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలలో గుండాల తహశీల్దార్ ఖాసీం  పాల్గొన్నారు. అధికారులు మార్కెట్‌లోని కూల్డ్రింక్స్, జ్యూస్, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తువుల గడువు తేదీలను పరిశీలించారు. కొన్ని దుకాణాలలో డ్రింక్స్, ఇతర వస్తువుల నమూనాలను సేకరించారు. సంబంధిత వ్యాపారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు సహించము. గడువు ముగిసిన వస్తువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి దుకాణదారు తమ షెల్ఫ్‌లలో ఉన్న వస్తువులను సమయానుసారం తనిఖీ చేసుకోవాలని, గడువు తీరిన వస్తువులను తక్షణమే తొలగించాలని సూచించారు.
ఈ చర్యతో గుండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యపై అధికారులు వెంటనే స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య భారత్ న్యూస్ & SB NEWS కథనం ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి రావడం చాలా మంచి పరిణామం అని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఇక ముందుకూడ 
అధికారుల తనిఖీలు కొనసాగుతాయని, ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి, గడువు ముగిసిన ఉత్పత్తులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి, గుండాల