క్రీడాకారులకు వసతుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి - డిపిఓ అనూష


- రాష్ట్రస్థాయి క్రీడలకు 500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యే అవకాశం
- ఆ మూడు రోజులు ఇసుక ట్రాక్టర్లను ఆపి వేయండి
- రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల గ్రౌండ్ పరిశీలించిన డిపిఓ అనూష
రాష్ట్రస్థాయి అండర్- 17 కబడ్డీ పోటీలు నవంబర్ 8 9 10వ తేదీలలో పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూష ఆకస్మికంగా పర్యటించి, పరిశీలించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పినపాక లో పర్యటించడం మొదటిసారి. డిఎల్పీఓ సుధీర్ కుమార్, తాసిల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య కలిసి పాఠశాల గ్రౌండ్ ను పరిశీలించారు. పాఠశాల గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అలాగే ఏర్పాటు చేసిన వసతి గదులను పరిశీలించారు. 33 జిల్లాల నుండి క్రీడాకారులు ఈ క్రీడలకు హాజరవుతారని క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలకు లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులుగా మనపై ఉందన్నారు. అలాగే వాహన సౌకర్యం సైతం క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అలాగే క్రీడాకారులు 500 మందికి పైగా, వందమందికి పైగా కోచ్ లు, ఐదువేల మందికి పైగా వీక్షకులు వస్తారని కావున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఎంఈఓ నాగయ్యను అడిగి పాఠశాల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రౌండ్ ల  ఏర్పాటు గురించి పీడీ  వీరన్నను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇసుక లారీలు, ట్రాక్టర్లు రెండు రోజులపాటు నిలిపివేయాలని తాసిల్దార్ గోపాలకృష్ణ  ను కోరారు. క్రీడలు జరిగే మూడు రోజులు ఇసుక లారీలకు ప్రత్యామ్నాయ  మార్గాలు చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక మాత్రమే తోలాలని తాసిల్దార్ గోపాలకృష్ణ కు సూచించారు.  అనంతరం సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల వసతి గదులను పరిశీలించారు. పూర్తిస్థాయిలో గ్రీన్ మ్యాట్ పై క్రీడలు జరుగుతాయని తెలియజేశారు. మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం లాంటివి ఖచ్చితంగా క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలని ఎంపీ ఓ వెంకటేశ్వరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ గుంటుపల్లి వేణు కుమార్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతిరెడ్డి, పాఠశాల విద్యార్థులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ సెక్రెటరీ జయపాల్ రెడ్డి, ఇతర సెక్రటరీలు, పాల్గొన్నారు.