🔹 అధికారుల నిర్లక్ష్యం – ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
🔹 రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు – జోరుగా రవాణా
స్వాతంత్ర్య భారత్ న్యూస్ అశ్వాపురం ప్రతినిధి నవంబర్ 26:
అశ్వాపురం మండలంలోని పాములపల్లి–చిన్నారవిగూడెం గ్రామాల మధ్య గోదావరి నది ఒడ్డున అక్రమ ఇసుక తవ్వకం & రవాణా బహిరంగంగానే సాగుతుండటం ప్రాంత ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ప్రాజెక్టు పనుల పేరిట కట్ట నిర్మాణం చేస్తామని చెప్పి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి బయటకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజుల్లో సుమారు 400 లారీలు/ట్రాక్టర్లు ఇసుకను కట్ట ప్రక్కన పోస్తూ నిరంతరం రవాణా చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తవ్వకాల్లో నిమగ్నమై ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతున్నాయని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పనుల పేరుతో ఇసుక తీసుకుంటున్నారని చెబుతున్నారు. కానీ ఇంత పరిమితి దాటిన తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి? ఎవరి అండదండతో ఇంత పెద్ద ఎత్తున రవాణా సాగుతోందన్నారు. దీని పైన
ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
రోడ్ల పరిస్థితి దయనీయంగా – ప్రమాదాలకు గురి అవుతున్న గ్రామస్తులు
పాములపల్లి–బట్టీలగుంపు రహదారి ఇసుక ట్రాక్టర్ల కారణంగా దుమ్ముతో కమ్మేసి ప్రయాణం కష్టంగా మారింది. అధిక వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ల వల్ల పిల్లలు, వృద్ధులు ప్రమాద భయంతో బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు.
గ్రామస్థుల సమాచారం ప్రకారం ఒక్కో ట్రాక్టర్‌కు ఇసుక ₹2,500 – ₹3,000 వరకు అమ్మకానికి వెళ్తోందన్నారు.
ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతుండగా
ఎవరూ తనిఖీలు చేయకపోవడం, ఎటువంటి చర్యలు లేకపోవడం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం ప్రజల్లో “ముడుపుల ప్రభావమా?” అనే అనుమానాలకు దారితీస్తోంది.
Social Plugin