జన గణన వివరాలు పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంటాయి



- ఆర్డిఐ, కోర్టుల ద్వారా కూడా సమాచారాన్ని పొందలేరు
- జన గణన అధికారులకు ప్రజలు సమాచారం         నిష్పక్షపాతంగా అందించండి 
- పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలో సర్వే 
- ప్రీ టెస్ట్ జనగణన సర్వే దేశానికి ఆదర్శం కావాలి 
- జన గణన డైరెక్టర్ భారతి హోలీ హేరీ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

జనగణన ప్రక్రియలో సవాళ్లు, సమస్యలను గుర్తించడం కోసం ప్రీ టెస్ట్ జనగణ కార్యక్రమం డిజిటల్ రూపంలో నిర్వహించడం జరుగుతుందని జనగణన డైరెక్టర్ భారతి హోలీ హేరీ అన్నారు. శుక్రవారం పినపాక రైతు వేదికలో జనగణన ఎన్యుమరేటర్ల కు, సూపర్‌వైజర్లకు నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ డేటా సేకరణ కోసం ఉపయోగించే మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సాధనాలను పరీక్షించడం, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, పద్ధతులను మూల్యాంకనం చేయడం, లాజిస్టిక్స్, శిక్షణ ప్రభావం, ప్రింటింగ్ ప్రక్రియలు వంటి వాటిని అంచనా వేయడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎటువంటి అనుమానాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ సర్వే తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం లో జరుగుతుందని తెలిపారు.అనంతరం జనగణన డైరెక్టర్ భారతి హోలీ హేరీ మాట్లాడుతూ ప్రీ-టెస్ట్ జనగణన అనేది 2027లో జరగనున్న జాతీయ జనగణనకు ముందు నిర్వహించే ఒక పరీక్ష అన్నారు. ఇది నవంబర్ 10 నుండి 30 జరుగుతోందన్నారు.పినపాకలో 7 రెవెన్యూ గ్రామాల్లో సర్వే జరుగుతోందన్నారు. 44 మంది టీచర్లకు ఎన్యుమరేటర్లగా, ఏడుగురికి సూపర్‌వైజర్లుగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ సర్వేలో కుటుంబాల వివరాలతో పాటు, ఆహార అలవాట్ల వంటి ప్రశ్నలు ఉంటాయన్నారు. డిజిటల్ పరిజ్ఞానంతో మొదటిసారిగా, డేటాను సేకరించడానికి ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తారని తెలిపారు. మొబైల్ యాప్ లో అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఒక్కో ఎన్యూరేటర్ కు సుమారు 150 నుంచి 200 ఇండ్లను కేటాయించామన్నారు. వారి సెల్ఫోన్లలో డిజిటల్ లేఅవుట్, హౌస్ లిస్టింగ్ అనే రెండు యాప్ లను ఇన్స్టాల్ చేశామని ప్రస్తుతం ఆయా ఇండ్లలోని కుటుంబాల వివరాలన్నీ ఈ యాప్లోనే నమోదు చేస్తున్నారని తెలిపారు.భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం అధికారికంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రజలు తమ గృహ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారని తెలిపారు.
ఈ ప్రీ-టెస్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, గ్రామాల ప్రాజెక్టుల వారీగా లే-అవుట్ మ్యాప్‌లను సిద్ధం చేశామన్నారు. గృహాల సంఖ్య, కుటుంబ సభ్యులు, సౌకర్యాల వివరాలు, గృహ నిర్మాణం, విద్యుత్, నీటి వసతుల వంటి అంశాలను సేకరించి పూర్తిస్థాయిలో డిజిటల్ చేస్తున్నామని తెలిపారు. అధికారులు సేకరించిన వివరాలు పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచబడతాయని, ఆర్టిఐ ద్వారా కూడా ఈ సమాచారాన్ని సేకరించలేరు అన్నారు. కోర్టుకు కూడా ఈ సమాచారాన్ని అడిగే హక్కు లేదని తెలిపారు. కావున ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు కనుక ప్రజలు ముఖ్యమైన ఈ ప్రక్రియలో పాల్గొని, మీ సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయగలరని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దేశంలో ఏ ప్రాంతం వారు ఉన్నా, ఇతర దేశాల వారు ఉన్నా కూడా ఈ గణనలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎటువంటి అనుమానాలు లేకుండా ఇంటికి వచ్చే జనకరణ అధికారులకు ప్రజలు పూర్తి వివరాలు తెలియజేయవచ్చని కోరారు. మీరు ఉన్న ఇంటి వద్ద మాత్రమే సర్వే నిర్వహిస్తామని తెలిపారు. పూర్తికానీ ఇళ్ల వద్ద సర్వే జరగదని తెలిపారు. అనంతరం ఎన్యూరేటర్ లు యాప్ లో వచ్చిన సమస్యలను కలెక్టర్, డైరెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లగా ఆ సమస్యల విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సెన్సెస్ ఆపరేషన్ ఆర్ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు, సెన్సెస్ ఆఫీసర్లు సతీష్, హిమవర్ష, హరిత, వినయ్, తిరుపతి, తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంఈఓ నాగయ్య, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.