స్వాతంత్ర్య భారత్ న్యూస్ నాగర్ కర్నూల్ ప్రతినిధి
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు గురువారం రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ భూమి వ్యవహారంలో జరుగుతున్న జోక్యంతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించినట్లు సమాచారం.
శంకర్ గౌడ్ వసంతాపూర్ శివారులో తన వారసత్వ భూమితో పాటు కొనుగోలు చేసిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకునే కొందరు విక్రయానికి అడ్డుపడుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఈ వివాదంతో తీవ్రంగా మనస్థాపం చెందిన రైతు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని, భూమి వ్యవహారాల్లో తమ జోక్యం లేదని ఎమ్మెల్యే అనుచరులు స్పష్టం చేశారు.
Social Plugin