గిరిజన గ్రామాల్లో సమస్యల పైన చిన్న చూపు ఎందుకు?
- టిఏజిఎస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన
- ఐదు కిలోమీటర్లు పాదయాత్రగా నిరసన తెలిపిన వందలాది మంది గిరిజనులు
పినపాక
వలస ఆదివాసి గిరిజన గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సమస్యలను పరిష్కరించాలని నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించగా, ఈ ర్యాలీలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య , జిల్లా కమిటీ సభ్యులు పాయం నరసింహారావు , జిల్లా ఉపాధ్యక్షులు మడివి రమేష్ పాల్గొన్నారు. సోమవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ నుండి పినపాక తహసిల్దార్ కార్యాలయం వరకు
సుమారు 1000 మంది గిరిజనులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో మానవహారం నిర్వహించారు. గిరిజనులు డప్పు వాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో నిరసన తెలిపారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు పాదయాత్రగా వెళ్లి కార్యాలయం ముందు వందలాదిమంది గిరిజనులు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై పూర్తిస్థాయిలో మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరవడం వల్లే ఇంటి బాట పట్టిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
గిరిజన గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు రోడ్లు, వంతెనలు, ఇళ్లు, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు విద్య సంస్థల నిర్మాణం, మెరుగుదల, ఉపాధ్యాయుల నియామకం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కల్పన, రహదారుల నిర్మాణం, ఇంటి నిర్మాణం వంటివి చేపట్టాలన్నారు. ఐటీడీఏ వంటి సంస్థలుతమ ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు.గిరిజన గూడాలల్లో మౌలిక వసతులు కల్పించి ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో రహదారులు లేక ఇంకా అనారోగ్యం పాలైన, గర్భవతులను జోలి కట్టుకొని తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులు చూసైనా కనీసం అధికారులు మారడం లేదన్నారు. పోడు భూముల్లో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని గిరిజనులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యకాండ చేస్తున్నారన్నారు. దీనిపై తాసిల్దార్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే వలస ఆదివాసీలకు కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. కుల ధ్రువీకరణ పత్రాలు రాకపోవడంతో వలస ఆదివాసీలు విద్యకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని తెలిపారు వలస ఆదివాసి గ్రామాలకు విద్య వైద్య సౌకర్యంతో పాటు సరైన రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని రాత్రి వేళల్లో కరెంటు లేక విష పురుగులు కరిచి మృత్యువాత పడిన రోజులు గుర్తుచేసుకున్నారు. గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలన్నారు. అనంతరం తాసిల్దార్ గోపాలకృష్ణకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న తాసిల్దార్ గోపాలకృష్ణ తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగతా అంశాలను ఉన్నతాధికార దృష్టికి తీసుకువెళతారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిఏజిఎస్ జిల్లా నాయకులు నూపా లక్ష్మయ్య, బడిస నర్సయ్యా, చందు, బొగ్గం శంకర్, మోడియం రాజు ,నూపా వాసు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప అధ్యక్షులు నిమ్మల వెంకన్న, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల శ్రీనివాసరావు, గిరిజన సంఘ కొమరం కాంతారావు, కేవీపీస్ పూసా పెద్ద నరసింహ రావు, వ్యవసాయ కార్మిస సంఘం మండల నాయకులు కురసం లక్ష్మయ్యః, కల్తీ నాగేశ్వర రావు, వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు.
Social Plugin