- ఉచిత విద్య అందిస్తున్న బృహస్పతి సేవలు మరువలేము
పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ ఆశయాల సారధి శ్రీరామ్ బృహస్పతి అని
డా.బీ.ఆర్.అంబేద్కర్ సేవా సమితి(ఇంటర్నేషనల్) జిల్లా. అధ్యక్షులు కత్తి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు సోంపల్లి తిరుపతి,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లెపోగు వెంకటేశ్వర్లు ,షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు లు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్న స్వాతంత్ర్య భారత్ ఉచిత లైబ్రరీ, కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్న బృహస్పతిని ఘన సన్మానం చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా లైబ్రరీ ఏర్పాటు చేయడమే కాకుండా, ఉచితంగా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు, వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు స్టడీ రూమ్ , కంప్యూటర్ లను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా పరీక్షలు ఉచితంగా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. బీసీ బిడ్డగా బృహస్పతి దళిత, గిరిజన బహుజనుల బాధలను, కష్టాలను పత్రిక రూపంలో అధికారులకు తెలియజేస్తూ , ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న ఆయనను సన్మానించడం గర్వంగా ఉందన్నారు . వందలాది మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ఆయన సేవలను గుర్తించడం గర్వకారణంగా ఉందన్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరి వద్ద ఆశించకుండా తన ఆదాయం మొత్తం పేదల చదువుల కోసం వినియోగించడం గొప్ప విషయం అన్నారు.
నేటి కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా గర్వకారణం అని కొనియాడారు. బహుజన బిడ్డలు ఈ ఉచిత లైబ్రరీ, ఉచిత స్టడీ రూమ్ ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకులు తేగటి నరసింహారావు, ముస్లిం మైనారిటీ నాయకులు మహమ్మద్ అజ్మీయా, తదితరులు పాల్గొన్నారు
Social Plugin