కొమరం భీమ్ 125వ జయంతి ఘనంగా నిర్వహణ

కొమరం భీమ్ 125వ జయంతి ఘనంగా నిర్వహణ
గుండాల మండలం అక్టోబర్ 22 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో ఆదివాసీ మహానాయకుడు కొమరం భీమ్ 125వ జయంతి ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద పూలమాలలు అర్పించి, నివాళులర్పించిన అనంతరం స్థానిక ఆదివాసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

నాయకులు మాట్లాడుతూ — కొమరం భీమ్ నాటి నిజాం, బ్రిటిష్ దోపిడీ పాలనలకు వ్యతిరేకంగా స్వయం పాలన కోసం చేసిన పోరాటం ఆదివాసీ గర్వకారణమని పేర్కొన్నారు. “మా ఊళ్లో మా రాజ్యం” అనే నినాదంతో గూడేలను చైతన్యవంతం చేసి, జల్, జంగిల్, జమీన్ హక్కుల కోసం త్యాగపథంలో అడుగులు వేసిన కొమరం భీమ్ నేటి తరాలకు ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు.

నేటికీ ఆదివాసీలు విద్య, వైద్యం, ఉద్యోగం వంటి రంగాల్లో వెనుకబాటుతనంతో ఉన్నారని, గ్రామాల్లో రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, కమ్యూనికేషన్ సదుపాయాల కొరత వల్ల అభివృద్ధి సాధ్యంకాలేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కొమరం భీమ్ ఆశయాలను నేటి యువత చైతన్యంగా తీసుకొని ఉన్నత విద్యను పొందడం ద్వారా తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కొమరం భీమ్ త్యాగం కేవలం చరిత్రలో ఒక అధ్యాయం కాదని, అది ఆదివాసీ ఆత్మగౌరవ చిహ్నం అని స్పష్టం చేశారు. ఆదివాసీ జాతి అస్తిత్వం, సంప్రదాయాలు, సంస్కృతి తరతరాలపాటు నిలవాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులై సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఇర్ప బుచ్చయ్య, ఇర్ప కృష్ణ, కల్తీ శ్రీను, దానసరి లక్ష్మయ్య, ఇర్ప కృష్ణ, సురేందర్, భాస్కర్, రమేష్, నారాయణ, సంపత్, కార్తీక్, జంపయ్య, రాజేష్ పాల్గొన్నారు.

అదేవిధంగా, జగ్గాయిగూడెం గ్రామంలో కూడా కొమరం భీమ్ 125వ జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పొంబోయిన సుధర్షన్, పొంబోయిన ప్రమోద్, ఈసం రాకేష్, తోలేం మోహన్ రావు, ఈసం రవి, ఈసం యర్రయ్య, వూకే కృష్ణ, చింత బస్కర్, చింత నాయనయ్య, పొంబోయిన లోకేష్ తదితర ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు