శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకున్న కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకున్న కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
-ప్రత్యేక పూజలు.. భక్తుల సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (ఎస్‌బీ న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ప్రధాన అర్చకులు వీరయ్య పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు.
కలెక్టర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువత విద్య, ఉపాధి రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, వార్షిక ఉత్సవాల ప్రాముఖ్యతను ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఎంపీడీవో సుధాకర్, స్థానిక ఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.


---

వంకేశ్వరంలో మినీ స్టేడియం ఏర్పాటుకు వేగం

ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (ఎస్‌బీ న్యూస్): అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరం గ్రామంలో ప్రతిపాదిత మినీ స్టేడియం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న కలెక్టర్, యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన వేదికలు కల్పించాలని అధికారులకు సూచించారు.
వంకేశ్వరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 254లో ఉన్న 3 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని పరిశీలించిన కలెక్టర్, స్థల విస్తీర్ణం, రాకపోకల సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణ అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. మినీ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేయాలని, భూ రికార్డులు, సర్వే ప్రక్రియలను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మినీ స్టేడియం నిర్మాణంతో గ్రామీణ యువతకు శిక్షణ, సాధన, క్రీడా పోటీల నిర్వహణకు మెరుగైన వేదిక లభిస్తుందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు తయారవుతారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. పరిశీలనలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఎంపీడీవో సుధాకర్, గ్రామ సర్పంచ్ మౌనిక, పంచాయతీ కార్యదర్శి రమ్య, సర్వేయర్ విజయనిర్మల, స్థానిక ఎస్‌ఐతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు