అశ్వాపురం మండలం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల వేడుకలు శ్రావణమాసం రెండు ఆదివారం చవిటిగూడెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఇంటిని శుభ్రం చేసుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం వండి బోనాo నెత్తిన ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. “అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలి.. ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలి” అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.గ్రామ దేవత బొడ్రాయి వద్ద తొలి పూజ నిర్వహించారు. నైవేద్యం సమర్పించి, పొట్టేళ్ళు బలి ఇచ్చి అమ్నవారికి మొక్కులు చెల్లించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు.
బోనాల వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
0 కామెంట్‌లు