గుండాలలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. ఆదివాసీ నిరుపేద శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి

గుండాలలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ

ఆదివాసీ నిరుపేద శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి

మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం డిమాండ్

*గుండాల మండలం ఆగస్టు 31 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ యువతి ఊకే శిరీష (21) అనుమానాస్పద మృతిపై గుండాల మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుండాల గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిరీషకు ఘనంగా నివాళులర్పించారు.

శిరీష తండ్రి ఊకే బ్రహ్మం (లేటు), తల్లి ఊకే రామలక్ష్మి. పేద కుటుంబానికి చెందిన శిరీష జైమ్ జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి, భద్రాచలం ఐటిడిఏ ద్వారా ఉపాధి అవకాశాల్లో ప్రైవేట్ ఉద్యోగం సాధించింది. కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు వెళ్లి తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది.

డ్యూటీ అనంతరం తన నివాస గదిలోనే శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం అత్యంత విషాదకరమైన సంఘటన అని అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన యువతి ఉపాధి కోసం నగరానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచివేసిందన్నారు.

శిరీష మృతికి గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేసి, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు అండగా ఉంటాయని నాయకులు తెలిపారు. అనంతరం కొవ్వొత్తులతో మౌనం పాటిస్తూ శిరీషకు నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు