గుండాల ప్రజా వాణిలో ప్రజా సమస్యలపై వినతి పత్రం, సమస్యలను వెంటనే పరిష్కారించాలి: తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు

గుండాల ప్రజా వాణిలో ప్రజా సమస్యలపై వినతి పత్రం

సమస్యలను వెంటనే పరిష్కారించాలి: తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు


ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరతను పరిష్కరించాలి

పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలి

మండల కేంద్రంలో సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందించాలి


ఆన్‌లైన్ యూరియా సరఫరా విధానంతో రైతులు ఎదురుకుంటున్న ఇబ్బందులను పరిష్కరించాలి

గుండాల మండలం ఆగస్టు 18 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:


 మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.

గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఫార్మాసిస్టులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో మందుల కొరతను వెంటనే నివారించాలని కోరారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఎంతో కీలకమని, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే యూరియా కోసం ఆన్‌లైన్ విధానంలో సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరాలో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కోరారు.

నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఏర్పడటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో మంజూరు కాక లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా గామలపాటి నాగేష్ ఇంటి నుంచి ఆవుల వెంకన్న ఇంటి వరకు, నునావత్ మోహన్ ఇంటి నుంచి చుంచు సాంబశివరావు ఇంటి వరకు, వజ్జ నారాయణ ఇంటి నుంచి వెంకటేశ్వర్లు ఇంటి వరకు సీసీ రోడ్లు మంజూరు చేసి నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు