రేగా కాంతారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ

రేగా కాంతారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ
 మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావుపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ డిమాండ్ చేశారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావుపై కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నత నాయకత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి ద్వంద్వ వైఖరిని అవలంబించరాదని ఆమె పేర్కొన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని, అలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో పారదర్శకంగా వ్యవహరించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అదే ప్రమాణాలను రేగా కాంతారావు విషయంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకరికి ఒక విధానం, మరొకరికి మరో విధానం ఉండకూడదని, పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరికీ సమాన న్యాయం జరగాలని అన్నారు.

ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున దర్యాప్తు స్వతంత్రంగా జరిగేలా సహకరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొంటూనే, పార్టీ పరంగా నైతిక బాధ్యతను విస్మరించరాదని జిమ్మా ఝాన్సీ అన్నారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడే పరిస్థితి ఉండకూడదని, ఈ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా పరిగణించాలని ఆమె కోరారు.

బీఆర్ఎస్ అధినేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, ఆరోపణల తీవ్రత దృష్ట్యా రేగా కాంతారావుపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళల పట్ల పార్టీ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన సమయం ఇదేనని అన్నారు.

ఈ అంశంపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే మండలవ్యాప్తంగా మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిమ్మా ఝాన్సీ హెచ్చరించారు. అవసరమైతే రోడ్డుపై బైఠాయించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.
===============================
(ఈ వ్యవహారంలో నమోదైన కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలపై తుది నిర్ధారణ దర్యాప్తు మరియు న్యాయ ప్రక్రియ అనంతరం మాత్రమే తేలనుంది)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు