భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార వేడి రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డ్ సభ్యుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయం సాధింపజేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రోజంతా గ్రామాల వారీగా తిరుగుతూ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
76 సంవత్సరాల వయసులోనూ ఏ యువ నాయకుడికీ తగ్గని శక్తితో ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్న రామనాథం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వరుస కార్యక్రమాలు, వాతావరణం, తక్కువ విశ్రాంతి కారణంగా అలసట పెరిగి తీవ్ర జ్వరంతో కుంగిపోయిన ఆయనను కాంగ్రెస్ నాయకులు వెంటనే పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అధిక జ్వరం, నీరసం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు సెలైన్‌లు ఎక్కించి తగిన చికిత్స అందించారు.
తాత్కాలికంగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ రామనాథం గారికి తప్పనిసరిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. తరచూ విరామాలు తీసుకోవాలని, శక్తివంతమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఇక ఆయన అనారోగ్య సమాచారం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పినపాక ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆయన నాయకత్వం ఎంతో ముఖ్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రామనాథం త్వరలో కోలుకుని తిరిగి ప్రచారంలో పాల్గొనాలని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Social Plugin