- ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
పినపాక :గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకొని పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో రాసే పదాలు తప్పులు లేకుండా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నందుకు పిల్లల విద్యాభ్యాసం కాస్త మెరుగుపడిందని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు పినపాక మండలంలోని రామాంజనేయ పురం, దుగినేపల్లి గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆయన ఉపాధ్యాయుడి పాత్ర నిర్వహించి పిల్లల చేత బోర్డుపై అక్షరమాల , వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎలా రాయాలో పిల్లల చేత రాయించి పిల్లలు అడిగిన ప్రతి పదాలను బోర్డుపై రాయడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిపిఎస్ పాఠశాలలో చదివే పిల్లల యొక్క విద్యాభ్యాసం పునాది నుండి పటిష్టంగా ఉండేలా ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని చాలా వరకు పిల్లలు అందులోని పదాలు, కూడికలు, తీసివేతలు ఇతర వస్తువుల యొక్క పేర్లు అర్థం చేసుకొని రాయగలుగుతున్నారని, ముఖ్యంగా చదువులో వెనుక పడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కొందరు పిల్లలు ఇంగ్లీషులోని పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని అందుకు అక్షరమాలకు సంబంధించిన అక్షరాలు పిల్లలందరూ తప్పులు లేకుండా రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్పించాలని, సంబంధిత ఎస్ సి ఆర్ పి ల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్నది లేనిది గమనించాలన్నారు. పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించాలని అన్నారు. అలాగే ఉద్దీపకం వర్క్ బుక్స్-2 వర్క్ బుక్ ప్రతి జిపిఎస్ పాఠశాలకు పంపిణీ చేసినందున ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించి పిల్లలందరూ చదవడం రాయడం వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంగ్లీషు గణితం కు సంబంధించిన ఉద్దీపకం వరకు బుక్స్-2 లోని అంశాలు పిల్లల చేత రాయించాలని అన్నారు. జిపిఎస్ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవానికి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు చాలా వరకు అర్థం చేసుకుంటున్నారని, ఉపాధ్యాయులు ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉద్దీపకం వర్క్ బుక్ -2 నిర్వహణపై ప్రత్యేక బాధ్యతతో పిల్లలకు తప్పనిసరిగా ప్రతి అంశం తెలిసేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ముత్తయ్య మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin