సుజాతనగర్ నవంబర్ 4( ): పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల పాత్ర వారి కృషి కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం సుజాతనగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించారు. స్వచ్ఛత కాంపైన్ 5.0 కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన శుభ్రతా చర్యల గురించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ రోజున పాఠశాలలో ఏ ఏ పనులు చేపట్టారు అని ఉపాధ్యాయులను అడిగి ,ఈ రోజున చేయవలసిన పనులు సక్రమంగా జరగకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం చేపడుతున్న ప్రతి విద్యా కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సమన్వయంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, తల్లిదండ్రుల సహకారంతో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల అభివృద్ధి అనేది కేవలం భవన నిర్మాణం లేదా వసతుల పెంపు కాదు, అది ఒక సమగ్ర ప్రక్రియ.అందులో ప్రధానోపాధ్యాయుడు కీలక నాయకత్వ పాత్ర పోషించాలి. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ ప్రధానోపాధ్యాయుని దిశానిర్దేశంపై ఆధారపడి ఉంటాయి, అని అన్నారు.పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించిన కలెక్టర్, కొన్ని టాయిలెట్లు మూసివేసి తాళం వేసి ఉంచినట్లు గమనించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అందుబాటులో ఉన్న వసతులను వినియోగించకపోవడం నిర్లక్ష్యమని పేర్కొని, వెంటనే టాయిలెట్లను తెరిచి మరమ్మతులు పూర్తి చేయాలని పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.త్రాగునీటి సౌకర్యం తగిన విధంగా లేని విషయం గమనించిన కలెక్టర్, పాఠశాలలో కొత్త బోర్ వేయడం కోసం తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని విద్యాశాఖాధికారి మిషన్ భగీరథ ఈ ఈ కు ఆదేశించారు. విద్యార్థులకు నిరంతరంగా శుద్ధమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇది పీఎం శ్రీ పాఠశాల కావడంతో, ఆటస్థల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి, విద్యార్థుల క్రీడా ప్రతిభను పెంపొందించే దిశగా అన్ని ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, క్రమశిక్షణతో పాటు సమూహ భావన కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల ప్రాంగణం బయట నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రంను కూడా ఆయన పరిశీలించారు. భవనం చాలా లోతులో నిర్మించబడినందున వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉందని గమనించి, సరైన ఎత్తు పెంచి మిగతా నిర్మాణ పనులు కొనసాగించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భవిత కేంద్రాలు పాఠశాలలకు విలువైన వనరుల కేంద్రాలుగా మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, కాబట్టి వాటి నిర్మాణం నాణ్యతతో కూడినదిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.కలెక్టర్ ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మరియు విద్యార్థుల ప్రతిభను పెంపొందించే పద్ధతులపై చర్చించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో మార్పు తీసుకురాగలడని, వారి కృషితోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత ఆదర్శవంతమైనవిగా మారుతాయని అన్నారు.
Social Plugin