నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా.. ప్రధాన సూత్రధారులు అరెస్టు

ఎస్. బి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అక్టోబర్ 16: నకిలీ వే బిల్లులతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. అక్టోబర్ 8న జగ్గారం ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా TS30TA6498 నంబర్‌ గల లారీని తనిఖీ చేయగా, ఆ లారీ ఇసుకతో నిండి ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ నాతి రాములు చూపించిన వే బిల్లు నిజమైనదేమోనని అనుమానం కలగడంతో పోలీసులు దానిని పరిశీలించారు. ఆ వే బిల్లు నకిలీ అని తేలడంతో పోలీసులు వెంటనే లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

తదుపరి విచారణలో డ్రైవర్ నాతి రాములు ఆ వే బిల్లును లారీ యజమాని హైదరాబాద్‌కు చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చినట్లు వెల్లడించాడు. రామానుజవరం ర్యాంపులో పనిచేసే కొంతమంది ఉద్యోగులు డిమాండ్ డ్రాఫ్ట్ లేకుండా ఇసుకను లారీలో లోడ్ చేసినట్లు కూడా సమాచారం ఇచ్చాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు రామానుజవరం ర్యాంపులో దర్యాప్తు జరిపారు.

దర్యాప్తులో టీజీఎండిసి (TGMDC)కి చెందిన ముగ్గురు ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్, నాగేల్లి మధు, బోల్లేదు అనిల్ ఇసుకను డీడీ లేకుండా లారీలో లోడ్ చేసినట్లు తేలింది. ఇసుకను లోడ్ చేసిన జెసిబి డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ ర్యాంపులో సూపర్వైజర్‌గా పనిచేసే సతీష్ రెడ్డి సూచనలతో ఆ పని చేసినట్లు వెల్లడించాడు.

ఈ వివరాల ఆధారంగా పోలీసులు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని కర్నాటి శివశంకర్ ఇంటిపై దాడి చేసి, నకిలీ వే బిల్లులు తయారుచేయడానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, రామానుజవరం ర్యాంప్ స్టాంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో శివశంకర్ తనకు వే బిల్లులు తయారు చేయడం నేర్పిన వ్యక్తి సంస్థాన్ నారాయణపూర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన ఇ. కిరణ్ అని తెలిపాడు.

కిరణ్ 2023లో వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్‌లో ఇదే నేరం కింద అరెస్టయి జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ కలిసి పలు రీచ్‌లకు సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేసి ఇసుక అక్రమ రవాణా చేసినట్లు విచారణలో తేలింది.

అరెస్టయిన నిందితులు:
1. కర్నాటి శివశంకర్ (34) – లారీ యజమాని, పుట్టపాక గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా
2. నాతి రాములు (42) – లారీ డ్రైవర్, జనగాం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా
3. ఇరగదిండ్ల ఉపేందర్ (35) – జెసిబి డ్రైవర్, బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ జిల్లా
4. దగ్గు నిఖిల్ దీప్ (29) – టీజీఎండిసి అసిస్టెంట్, నీరుకుళ్ళ, హన్మకొండ జిల్లా
5. నాగేల్లి మధు (38) – టీజీఎండిసి అసిస్టెంట్, అమీనపురం, మహబూబాబాద్ జిల్లా
6. బోల్లేదు అనిల్ (41) – టీజీఎండిసి సెక్యూరిటీ గార్డ్, అమీనపురం, మహబూబాబాద్ జిల్లా

పరారీలో ఉన్నవారు:
• ఇ. కిరణ్ – నకిలీ వే బిల్లులు తయారుచేసిన వ్యక్తి
• సతీష్ రెడ్డి – రామానుజవరం ఇసుక ర్యాంప్ సూపర్వైజర్
• సుర్వే శ్రీకాంత్ – లారీ యజమాని

ఈ కేసులో ఇంకా మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణా చేసినా, చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సమాచారం ఇవ్వదలచిన వారు అశ్వాపురం SHO (8712682093) లేదా SDPO మణుగూరు (8712682006) ను సంప్రదించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.