సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించిన ఎమ్మార్పీఎస్ — రాజ్యాంగంపై దాడిగా వ్యాఖ్య

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించిన ఎమ్మార్పీఎస్ — రాజ్యాంగంపై దాడిగా వ్యాఖ్య
గుండాల మండలం అక్టోబర్ 18 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.జె. బి.ఆర్. గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ర్యాలీకి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మంతెన ప్రభాకర్ మాట్లాడుతూ, చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయిపై దాడి కేవలం వ్యక్తిపై దాడి కాదు, అది భారత రాజ్యాంగంపై దాడిగా భావించాల్సినదని పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం పేరుతో సమాజంలో కులవివక్షను, అసమానతను ప్రోత్సహించే శక్తులు మరోసారి తలెత్తుతున్నాయని అన్నారు. "దేశంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేసే ఉన్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తి వెనుక ఎంతటి రాజకీయ శక్తులు ఉన్నా, ఎన్ని కుతంత్రాలు దాగి ఉన్నా, చట్టం ముందు అందరూ సమానమని ఆయన స్పష్టం చేశారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. "భారత రాజ్యాంగాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమని, దానిని దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వారిని ప్రజాస్వామ్య శక్తులు ఎదుర్కొంటాయి," అని అన్నారు. ప్రజల హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ ఎప్పటికప్పుడు కులవివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుండాల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బొమ్మేర్ల నాగేష్, ప్రధాన కార్యదర్శి కోళ్లు లక్ష్మీనారాయణ, నాయకులు బొమ్మెర సత్యం, కొప్పుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న కార్యకర్తలు “జస్టిస్ గవాయికి మద్దతు – రాజ్యాంగానికి రక్షణ”, “కులం-మతం పేరున దాడులు ఆపాలి”, “కులవివక్షకు తావులేదు” అంటూ నినాదాలు చేశారు. నిరసన అనంతరం స్థానిక తహసీల్దార్‌కు ఒక వినతి పత్రం అందజేశారు.