రవాణా శాఖ అవినీతిపై విచారణ జరిపించాలంటూ జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్

రవాణా శాఖ అవినీతిపై విచారణ జరిపించాలంటూ జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్
సిబ్బంది ఆస్తులపై, బినామీల ఆస్తులపై విచారణ జరపాలి – సూత్రధారులపైనా చర్యలు తీసుకోవాలి
స్వాతంత్ర్య భారత నస్ ప్రతినిధి కొత్తగూడెం: రవాణా శాఖలో వ్యాపిస్తున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అవినీతి రాకెట్ అంతుచిక్కని స్థాయికి చేరుకుందని, ప్రజల నుంచి వసూలు జరుగుతున్న అక్రమ రుసుములు, లంచాలు విపరీత స్థాయిలో ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.

యెర్రా కామేష్ మాట్లాడుతూ, రవాణా శాఖలో బస్సులు, లారీలు, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల వంటి ప్రతి సేవకు అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. “ప్రతి పని కోసం అదనపు వసూళ్లు తప్పనిసరైపోయాయి. ఇందుకోసం శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది కలిసి ఒక ప్రైవేట్ మాఫియాను ఏర్పాటు చేసుకుని ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అనంతరం డీలర్లు, ఏజెంట్లు వాహన యజమానుల నుంచి రుసుములు వసూలు చేసి, వాటిని అధికారులకు ముట్టజెప్పే దందా సిస్టమ్‌గా మారిందని కామేష్ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద ఇసుక లారీలు, ట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు అవుతున్నాయని, ఓవర్‌లోడింగ్ వాహనాలకు కేటాయించిన రేట్ల ప్రకారం డబ్బులు తీసుకుని దందా కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. “నాయకుల సూచనల మేరకు కొందరు చెక్‌పోస్టుల వద్ద ఇసుక లారీలు, ట్రాక్టర్లకు, స్కూల్ బస్సులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం” అని కామేష్ అన్నారు.

ప్రతి సంవత్సరం స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ సమయంలో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. “పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా లంచాలు తీసుకుంటున్న అధికారులను విడిచిపెట్టకూడదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పిర్యాదులు వచ్చినప్పుడల్లా చెక్‌పోస్టులపై తాత్కాలిక దాడులు చేసి, ‘చూపించు-చూసి మర్చిపో’ తరహా చర్యలు తీసుకుంటున్నారని, నిజమైన అవినీతి మూలాలను బయటపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని ఆయన విమర్శించారు. “కేవలం చిన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవడం సరిపోదు. వీరి వెనుక ఉన్న సూత్రధారులు, పెద్దలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి” అని యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.

రవాణా శాఖలోని అవినీతి తిమింగలాలు బయటకు రావాలంటే కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఉన్నవారి ఆస్తులపై, వారి బినామీల ఆస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ద్వారా పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. “ప్రజల డబ్బుతో కట్టిన ప్రభుత్వ వ్యవస్థను కొంతమంది వ్యక్తిగత లాభాల కోసం వాడుకుంటున్న అధికారులు కఠినంగా శిక్షించబడాలి. ప్రభుత్వానికి నిజమైన నిబద్ధత ఉంటే ఈ దందాకు పాల్పడుతున్న వారిని గుర్తించి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి” అని స్పష్టం చేశారు.

ఇక రవాణా శాఖలో పారదర్శకత కోసం టెక్నాలజీ ఆధారిత సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఫిట్‌నెస్ వంటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే మధ్యవర్తుల ప్రాధాన్యం తగ్గి అవినీతి తగ్గుతుందని కామేష్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “ఎవరైనా లంచాలు డిమాండ్ చేసినా భయపడకుండా, విజిలెన్స్ లేదా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేయాలి. అవినీతి అంతం చేయాలంటే ప్రజల సహకారం కూడా అవసరం” అన్నారు.

ఈ సమావేశంలో జేబీపీ నాయకులు బన్నీ, వినయ్, మురళి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు ప్రభుత్వం ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని, నిర్ధోషులను కాపాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.