రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి – రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు : మంత్రిమండలి కీలక నిర్ణయాలు


హైదరాబాద్, అక్టోబర్ 16 (ఎస్ బి న్యూస్): 

వర్షాకాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో, ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాలు

రాష్ట్రంలో ఈ సీజన్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకారం తెలిపింది. మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని మంత్రిమండలి తీర్మానించింది.




రైతులు ధాన్యం విక్రయం సమయంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను కూడా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వ్యవసాయ విద్య విస్తరణ

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, యువతలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపునకు భాగంగా మూడు కొత్త వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. వీటిని హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.



ప్రజా విజయోత్సవాలు

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు” నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలకు మించి సంతానం కలిగిన వారు అర్హులు కాదన్న నిబంధనపై కూడా మంత్రివర్గం చర్చించింది. గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవడంతో ఆ నిబంధనను ఎత్తివేయాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా నిర్ణయించింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్ణయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ మండలంలోని ఏన్కూర్ మార్కెట్ యార్డుకు 10 ఎకరాల భూమిని కేటాయించింది.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ, తెలంగాణ స్థానిక విద్యార్థుల కోటాను ప్రస్తుత 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని తీర్మానించింది.




హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, మెట్రో 2A, 2B దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించేందుకు పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి దశను ఎల్ అండ్ టీ నుండి స్వాధీనం చేసుకునే అవకాశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఈ అంశంపై సాధ్యాసాధ్యాలు, చట్టపరమైన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ నివేదిక ఆధారంగా మంత్రివర్గ ఉపసంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది.

రోడ్ల నిర్మాణం, రక్షణ శాఖ భూముల మార్పిడి

రాష్ట్రంలో హైబ్రిడ్ అన్న్యుటీ మోడల్‌ (HAM) పద్ధతిలో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు, అలాగే ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన రక్షణ శాఖ భూముల మార్పిడి కోసం ఆ శాఖకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కృష్ణా–వికారాబాద్ రైల్వే ప్రాజెక్టు




కృష్ణా–వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించి 845 హెక్టార్ల భూమి సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.

మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్

పర్యాటక, భక్తి, అభివృద్ధి దృష్ట్యా కీలకమైన మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యయంలో మూడో వంతు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.




మంత్రుల వివరణ

మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు వాకిటి శ్రీహరి మీడియా సమావేశంలో వెల్లడించారు.
వారు మాట్లాడుతూ, “రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రవాణా, విద్యా, మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ నిర్ణయాల ఉద్దేశ్యం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది” అని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి పథంలో మరింత వేగం పెంచుతున్న ప్రజా ప్రభుత్వం – రైతాంగం, విద్య, రవాణా, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ కేబినెట్ సమావేశం ప్రధాన లక్ష్యం.