ఇంకెంతకాలం డోలిమోతలు? రహదారి కోసం సుందరయ్య నగర్ గిరిజనుల ఆవేదన

  • - అనారోగ్యం వస్తే ప్రాణాలు పోయేలా ఉన్నాయి 
  • - సుందరయ్య నగర్ గిరిజనుల ఆవేదన 
  • - మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముట్టడించిన గ్రామస్తులు 
  • - రెండు రోజుల్లో తాత్కాలిక రహదారి మరమ్మత్తులు చేస్తామన్న ఎంపీడీవో 


పినపాక, అక్టోబర్ 13 (ఎస్ బి న్యూస్): స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా నేటికీ ఆదివాసి గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు సిపిఎం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.
 సుందరయ్య నగర్ గ్రామస్తులు తమ రహదారిపై హామీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ సుందరయ్య నగర్ గ్రామంలో రహదారి నిర్మిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వంగాని, ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యం సరికాదన్నారు.
తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్ మాట్లాడుతూ అనారోగ్యం పాలైతే సుందరయ్య నగర్ గ్రామంలో ఇంకా డోలీలు కట్టాల్సి వస్తుందని ఇంకెంతకాలం ఈ డోలిమోతలు మాకు అని ప్రశ్నించారు. కనీసం పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి బడి సౌకర్యం కూడా లేదన్నారు. గిరిజన గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తానన్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనకబడిందని తెలిపారు. గతంలో అనేకసార్లు అధికారులు వచ్చి రోడ్డు పోస్తాను అని హామీ ఇచ్చారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. కొద్దిరోజుల క్రితం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ఈ ప్రాంతంలో పర్యటించి స్థానిక అధికారులతో మాట్లాడిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని సైతం మరిచారన్నారు.
 రహదారి సౌకర్యం కల్పించే వరకు కార్యాలయం ముందు కూర్చుంటామని తెలిపారు. అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘ మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ మాట్లాడుతూ సుందరయ్య నగర్ తో పాటు పినపాక మండలంలో వివిధ గిరిజన గ్రామాలకు రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం గ్రామాలకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే సుమారు 6 కిలోమీటర్లు కాలి నడకన కానీ డోలి గాని కట్టి మూసుకొని తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. అక్కడి నుంచి 4 కిలోమీర్ల దూరంలో ఉన్న జానంపేట పీహెచ్‌ సీకి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనివల్ల గిరిజనులకు ప్రాణాల మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆదివాసీ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సుందరయ్య నగర్ గ్రామస్తులు సుమారు 100 మంది, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.


రెండు రోజుల్లో రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేస్తాం 
- ఎంపీడీవో సునీల్ కుమార్ 

సుందరయ్య నగర్ రహదారికి రెండు రోజుల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేస్తాం. ప్రస్తుతం గ్రామస్తులు నడిచే విధంగా , విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా రహదారిని బాగు చేస్తాం. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల ఒక నెలపాటు ఆలస్యమైందన్నారు. రహదారి నడవడానికి సైతం సరిగా లేకపోవడం వాస్తవమే అన్నారు. తాసిల్దార్, సీఐ, అటవీశాఖ అధికారులతో సైతం సంప్రదిస్తామని తెలిపారు. కావున దీక్షను విరమించాలని కోరుతున్నాం.