తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

హైదరాబాద్ (SBNEWS): తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు నిజమైన ఆయుధం విద్య మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ కొత్త విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో, విద్యావేత్తలతో సమావేశం నిర్వహించిన ఆయన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా రంగాన్ని సమూలంగా మార్చాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పటి వరకు రాష్ట్ర విద్యా రంగంలో జరిగిన అభివృద్ధి సరిపోదు. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ విద్య వరకు పూర్తి స్థాయి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు భూములు, నిధులను పంచితే – మేము పేదరిక నిర్మూలన కోసం విద్యను ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నాం” అని అన్నారు.



విద్యా ప్రమాణాలపై ఆందోళన

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేస్తున్నా, ఉపాధి అవకాశాలు తగిన స్థాయిలో లభించడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులలో లక్ష మందికి పైగా ఉత్తీర్ణులవుతుంటే, వారిలో 10% మందికి కూడా ఉద్యోగాలు రాకపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోందన్నారు.

సబ్ కమిటీల ఏర్పాటు – 2047 దిశా నిర్దేశం

ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్య విభాగాలపై ప్రత్యేక సబ్ కమిటీలను ఏర్పాటు చేసి సమగ్ర పత్రాన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
అలాగే 2047 వరకు దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ఆయన సూచించారు. వచ్చే డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న “తెలంగాణ దార్శనికత పత్రం – 2047”లో విద్యకు ప్రత్యేక అధ్యాయం కేటాయిస్తామని వెల్లడించారు.



ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరమని, ఇకపై నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు పూర్తి పద్ధతి ప్రకారం విద్యా విధానం ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

విద్యా కార్పొరేషన్ ఏర్పాటు

రాష్ట్రంలో విద్యా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం అవసరమైన రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరామని సీఎం రేవంత్ తెలిపారు.