నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. సుమారు రూ.15 వేల కోట్ల వరకు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని ఆరోపించారు. ఫీజులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు కళాశాలల్లో పరీక్షలు రాయడం, సర్టిఫికెట్లు పొందడం, ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందడం వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు, విద్యను రాజకీయ అంశంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంగా ప్రభుత్వం చూడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయడంతో పాటు, భవిష్యత్తులో ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత సమయంలోనే నిధులు విడుదల చేసే విధంగా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపడతామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, వారి భవిష్యత్తుతో ఎవరూ చెలగాటం ఆడకూడదని స్పష్టం చేశారు.
"ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" ఉద్యమం విద్యార్థుల హక్కుల సాధన కోసమేనని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి తిరుమల్ యాదవ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ, మహిళా మోర్చా నాయకురాలు జానకి, యువమోర్చా నాయకులు పద్మ అనిల్, భగీరథ్, శివాజీ, నిశ్వంత్, మిద్దె రవి, రంజిత్, సంతోష్, శివచంద్ర, డేరంగుల శివ, అరవింద్ రెడ్డి, కల్వకుర్తి మండల యువమోర్చా అధ్యక్షుడు నాప శివ ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు